మిత్రులెవరో? శత్రువులెవరో? తెలుసుకోలేకపోయాం.. పరోక్షంగా బీజేపీపై నితీశ్ వ్యాఖ్యలు

0
22బిహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా తిరిగి బాధ్యతలు చేపట్టారు. అయితే, ఇటీవల అసోంలో జరిగిన పరిణామాలు బీజేపీ-జేడీ (యూ) మధ్య స్పర్ధలకు బీజం వేశాయనే వాదన వినబడుతోంది. తనకు ముఖ్యమంత్రి పదవిపై ఆశలేదని నితీశ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, జేడీ (యూ) రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఇటువంటి వ్యాఖ్యలే చేయడం గమనార్హం.

పాట్నా వేదికగా జరిగిన ఈ సమావేశాల్లో తొలి రోజు నితీశ్ మాట్లాడుతూ..ఎన్నికలప్పుడు శత్రువులెవరు? మిత్రులెవరు? అని తెలియకుండానే పోరాటం చేశామని వ్యాఖ్యానించారు. ఆయన నేరుగా బీజేపీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయకపోయినా… జేడీయూ వర్గాలు మాత్రం మిత్రపక్షాన్ని దృష్టిలో పెట్టుకునే నర్మగర్భ వ్యాఖ్యలు చేశారని పేర్కొంటున్నాయి.

అంతేకాదు, ఎన్నికల్లో ఓటమిపాలైన జేడీయూ నేతలు బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం వల్లే తాము ఓడిపోయామని అధినేతకు తెగేసి చెప్పినట్లు సమాచారం. జేడీయూ సీనియర్ నేతలు చంద్రికా రాయ్, బోగో సింగ్, జయకుమార్ సింగ్, లలన్ పాశ్వాన్, అరుణ్ మాంఝీ తదితరులు బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు. తాము ఎల్జేపీ వల్ల ఓడిపోలేదని, బీజేపీ కారణంగా ఓడిపోవాల్సి వచ్చిన విషయాన్ని నితీశ్ దృష్టికి తీసుకెళ్లారు.

సీనియర్ నేత బోగో సింగ్ మాట్లాడుతూ… తన నియోజకవర్గంలో ‘ఎల్జేపీ, బీజేపీ భాయీ, భాయీ’ అంటూ ప్రచారం జరిగిందని, దీని ఫలితాన్ని తాను అనుభవించాల్సి వచ్చిందని నితీశ్‌కు తెగేసి చెప్పారు. కొన్ని నియోజకవర్గాల్లో జేడీయూ అభ్యర్థుల ఓటమికి బీజేపీయే కారణమైందని బోగో సింగ్ తీవ్రంగా మండిపడ్డారు. సీనియర్లు అగ్గిమీద గుగ్గిలమై మాట్లాడినా… జేడీయూ అధ్యక్షుడు ఆర్సీపీ సింగ్, సీఎం నితీశ్ మౌనంగా వింటూ ఉండిపోయారు.

అయితే, ఎన్నికల్లో ఓటమిపాలైన నేతలు పరాజయాన్ని పక్కనబెట్టి కొత్త ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు. మీమీ నియోజకవర్గాల్లోని ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలను అందజేస్తే, వచ్చే ఎన్నికల్లో విజయం తప్పక వరిస్తుందని అన్నారు. ఐదేళ్లూ పూర్తికాలం ప్రభుత్వం అధికారంలో ఉంటుందని, సమాజంలోని అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here