బంపరాఫర్.. నాకు మద్దతిస్తే నీకు పెళ్లి.. ఆనందంతో గంతులేసిన బ్రహ్మాచారి!

0
24ఎన్నికల్లో ప్రత్యర్థులను చిత్తుచేసి, అధికారాన్ని హస్తగతం చేసుకోడానికి చేయని ప్రయత్నాలు ఉండవు. అయితే, సర్పంచ్ పదవి కోసం పెళ్లి పేరుతో ప్రత్యర్ధి పార్టీ సభ్యుడిని తనవైపు తిప్పుకున్న విచిత్ర ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. దీంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మధుర క్షణం రానేవచ్చిందని ఆ బ్రహ్మచారి ఉబ్బితబ్బుబ్బి అవుతున్నాడు. అతడి ఆనందం చూస్తే మాయబజార్ సినిమాలోని ‘ఆహనా పెళ్లి అంట…ఓహో నా పెళ్లి అంట…నీకు నాకు చెల్లంట ఠాం..ఠాం..ఠాం..’ పాట గుర్తుకొస్తుంది.

పిల్లను చూసి ఓ ఇంటివాడిని చేస్తామంటే పార్టీతో నాకేం పని అంటూ ప్రత్యర్థికి జై కొట్టేందుకు సిద్ధమయ్యాడు. అతడి నిర్ణయంతో సొంత పార్టీ నేతలు ఖంగుతిన్నారు. పెళ్లి ఇంత పనిచేస్తుందా? అని జుట్టుపీక్కుంటున్నారు. వివరాల్లోకి వెళితే ఇటీవల కర్ణాటకలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వెల్లడికావడంతో రామనగర్‌ జిల్లా కోడంబళ్లి అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు ఫిబ్రవరి 11న షెడ్యూలు ఖరారు చేశారు.

ఇక్కడ అధ్యక్ష స్థానం బీసీ ఏ అభ్యర్ధికి రిజర్వు కావడంతో కాంగ్రెస్‌కు చెందిన నేత రేసులో ఉన్నారు. అయితే, అతడికి సంఖ్యా బలం తక్కువ ఉండటంతో జేడీఎస్‌కు చెందిన వార్డు సభ్యుడు రవి మద్దతు అవసరమైంది. బ్రహ్మచారి అయిన రవి వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రామనగర్‌ జిల్లా గ్రామీణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అతడిని సంప్రదించి, మాకు మద్దతు ఇస్తే పెళ్లిచేసే బాధ్యత మేం తీసుకుంటామని బంపరాఫర్ ఇచ్చాడు. దీనికి రవి ఎస్ అనడంతో జేడీఎస్ నేతలు షాక్ తిన్నారు.

పెళ్లి కోసం పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. అంతేకాదు, మాజీ ముఖ్యమంత్రి చేత కూడా ఫోన్‌ చేయించినా ప్రయోజనం లేకపోయింది. నాకు పార్టీ కంటే పెళ్లే ముఖ్యమని తేల్చిచెప్పాడు. అతడి వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కుమారస్వామి అతడిని పార్టీ నుంచి బహిష్కరించాలని ఆదేశించారు. ఈ విషయంలో స్థానిక నాయకత్వం ఫిబ్రవరి 11 వరకు వేచిచేసే ధోరణిలో ఉన్నట్టు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here