ప్రపంచమంతా భవిష్యత్ భారత్‌వైపే చూస్తోంది.. రాజ్యసభలో మోదీ ప్రసంగం

0
25రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సోమవారం రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగం ఈ దశాబ్దానికే మార్గదర్శకమని మోదీ కితాబిచ్చారు. అనేక అవకాశాలకు భారత్ పుట్టినిల్లు అని, మరిన్ని కొత్త అవకాశాలు ప్రజల కోసం ఎదురు చూస్తున్నాయని పేర్కొన్నారు. భారత్ అత్యంత యవ్వనవంతమైన భూమి అని, తమ కలలను సాకారం చేసుకోవడానికి ఉత్సాహంతో పనిచేస్తోందన్నారు. ప్రతి అవకాశాన్నీ చేజారిపోకుండా చూసుకుంటోందని ఉద్ఘాటించారు.

కరోనాపై వైరస్‌పై పోరాటంలో భారత్ సాధించిన విజయం ప్రజలందరిదని మోదీ ప్రశంసించారు. ప్రపంచం మొత్తం భారత్‌వైపు అత్యంత ఆశతో ఎదురుచూస్తోందని.. ప్రపంచ అభివృద్ధి కోసం భారత్ దోహదపడుతుందన్న అంచనాలు ఉండటమే దీనికి కారణమని ఆయన అన్నారు. ప్ర‌పంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం భార‌త్‌లో కొన‌సాగుతోంద‌ని తెలిపారు. మహమ్మారిపై పోరులో భారత్‌ ప్రదర్శించిన స్ఫూర్తిని ప్రపంచ దేశాలు గుర్తించి, ప్ర‌శంసించాయ‌ని మోదీ చెప్పారు.

భార‌త‌ బలమేంటో ప్రపంచ దేశాలకు తెలిసిందని.. అన్ని ఇబ్బందుల‌ను అధిగ‌మించి దేశం ముంద‌కు సాగుతోంద‌ని పునరుద్ఘాటించారు. వ్యాక్సినేషన్‌ లో భారత్‌ ప్రపంచ శక్తిగా ఎదుగుతోందని చెప్పారు. అలాగే, కరోనాపై పోరులో అనేక దేశాలకు భార‌త్‌ అండగా నిలిచింద‌ని చెప్పారు. ఈ సందర్భంగా కొత్త సాగు చట్టాలు, రైతులు ఆందోళనలపై కూడా మోదీ మాట్లాడారు.

సాగు చట్టాలపై కేంద్రం, రైతుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయని.. తాము రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామ‌ని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా వ్య‌వ‌సాయ రంగంలో సంస్క‌ర‌ణ‌లు నిలిచిపోయాయ‌ని వ్యాఖ్యానించారు. స‌మ‌స్య‌ల‌ను చ‌ర్చించుకుని సామరస్యంగా ప‌రిష్క‌రించుకోవాలని, రైతుల‌తో చ‌ర్చ‌ల‌కు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని పునరుద్ఘాటించారు. రైతుల అభ్యంత‌రాల ప‌రిశీలన‌కు కేంద్రం సిద్ధంగా ఉంద‌ని మోదీ చెప్పారు. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌లో ఎలాంటి మార్పులూ ఉండ‌బోవ‌ని భరోసా ఇచ్చారు. రైతుల‌కు ఉన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చ‌ర్చ‌ల్లో వారు సూచ‌న‌లు చేశార‌ని, వాటి ప‌రిష్క‌ారానికి తాము సానుకూలంగా ఉన్నామ‌ని చెప్పారు.

రైతుల ఆందోళనకు కారణం ఏంటో తెలియడంలేదని, ఫసల్ బీమాను మరింత విస్తరింపజేస్తామని అన్నారు. రైతుల కోసం పింఛన్ ప్రవేశపెట్టామని మోదీ తెలిపారు. మన దేశంలో ప్రజాస్వామ్యం ఏమాత్రం బలహీనపడలేదని, ఎందుకంటే మానవ విలువలతో కూడిన పునాదులపై ప్రజాస్వామ్యం ఇక్కడ ఉందని వివరించారు. ఈ విషయాన్ని నేటితరం యువతకు వివరించి చెప్పడాన్ని మాత్రమే మనం మరిచిపోయామని గుర్తుచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here