ప్రధాని సహా సీఎంలు, 50 ఏళ్లు దాటిన నేతలకు రెండో దశలో కోవిడ్ టీకాలు!

0
19దేశంలో కరోనా జనవరి 16న ప్రారంభం కాగా.. చిన్న చిన్న అవాంతరాలు మినహా సజావుగా సాగుతోంది. తొలి దశలో కరోనా యోధులకు వ్యాక్సిన్ అందజేస్తున్నారు. వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులకు టీకా వేస్తున్నారు. కాగా, రాజకీయ నాయకులు టీకాలను ఎప్పుడు తీసుకుంటారని పరువురు ప్రశ్నిస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా తొలుత టీకాలు వారే వేయించుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.

మూడు నెలల కిందట కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్ష్‌వర్ధన్ మాట్లాడుతూ.. టీకా అందుబాటులోకి వచ్చిన వెంటనే తాను ఎయిమ్స్‌లో వ్యాక్సిన్ తీసుకుంటానని ప్రకటించారు. కానీ, ఆయన ఈ మాటను నిలబెట్టుకోలేదు. ఇదిలా ఉండగా.. మీడియాకు అందిన సమాచారం ప్రకారం.. ప్రధాని సహా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు రెండో దశలో వ్యాక్సినేషన్‌ తీసుకోనున్నారు. ప్రస్తుతం మొదలైన తొలిదశ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏప్రిల్ వరకూ కొనసాగనుంది.

రెండో దశలో 75 శాతం మంది పార్లమెంటు సభ్యులు, ముఖ్యమంత్రులు, మంత్రులు మొదలైనవారికి టీకాలు వేయనున్నారు. వీరిలో ముఖ్యంగా 50 ఏళ్లు, ఆపై వయసు వారికి తొలుత టీకా ఇస్తారని తెలుస్తోంది. అధిక రక్తపోటు, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి టీకాలు వేయడంలో ప్రాధాన్యత ఇస్తూ, మొదటి డోసు ఇవ్వనున్నారు.

పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్‌ను అనుసరించి లోక్‌సభలో 343 మంది, రాజ్యసభలో 200 మంది ఎంపీలు 50 ఏళ్లు దాటినవారు ఉన్నారు. ఇదేవిధంగా మోదీ క్యాబినెట్‌లోని 95 శాతం మంది మంత్రులకు టీకాలు వేయనున్నారు. టీకా పంపిణీపై నవంబరు 24న ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ ప్రధాని మోదీ ఈ విషయం చెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

మరోవైపు, టీకా పంపిణీకి కేంద్రం రూపొందించిన కొవిన్ యాప్‌లో తలెత్తిన సాంకేతిక లోపాలతో వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. జనవరి 16న దేశవ్యాప్తంగా టీకా పంపిణీ ప్రారంభం కాగా.. పలు రాష్ట్రాల్లో యాప్ మొరాయించడంతో వ్యాక్సినేషన్ నిలిపివేశారు. రెండు రోజుల పాటు టీకా పంపిణీ నిలిపివేసిన మహారాష్ట్ర.. తిరిగి జనవరి 19 నుంచి ప్రారంభించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here