వీరిలో యాంటీబాడీ పరీక్షలు నిర్వహించగా.. అప్పటికే 10% మంది కొవిడ్ బారినపడి కోలుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. మరో 346 మందిలో 3 నెలల తర్వాత, 45 మందిలో 6 నెలల తర్వాత కూడా యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్టు గుర్తించారు. జనసాంద్రత ఎక్కువగా ఉండే నగరాల్లో పాజిటివ్ రేటు ఎక్కువ ఉన్నట్టు తేలింది. వ్యక్తిగత వాహనాల్లో వెళ్లే వారితో పోలిస్తే.. ప్రజా రవాణాను వినియోగించుకునే వ్యక్తుల్లో వ్యాప్తి ఎక్కువగా ఉంది.
ఇక, శాకాహారుల్లో కోవిడ్ వ్యాప్తి 6.8 శాతంగా ఉంటే.. మాంసాహారుల్లో 11 శాతం వరకూ ఉన్నట్టు గుర్తించారు. ఇరుకైన ఇళ్లు, గదులలో నివశించే కుటుంబాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా కనిపించింది. బ్లడ్ గ్రూపులవారీగా జరిపిన అధ్యయనంలో.. ‘ఎ’ గ్రూపు వ్యక్తుల్లో వైరస్ పాజిటివ్ రేటు ఎక్కువగా ఉంటే.. ‘ఒ’ గ్రూపు వ్యక్తులు వైరస్ బాధితుల జాబితాలో దిగువన ఉన్నారు. వీరికి మధ్యలో ‘బి’‘ీబి’ గ్రూపుల వ్యక్తులున్నారు. ధూమపానం అలవాటు ఉన్న వ్యక్తుల్లోనూ సెరో-పాజిటివిటీ తక్కువ ఉన్నట్టు తేలింది.
అధ్యయనానికి కొనసాగింపుగా మూడు నెలల తరువాత 346 సెరోపోజిటివ్ వ్యక్తులలో కోవిడ్ యాంటీబాడీ స్థాయిలకు ‘స్థిరంగా’ ఉందని, అయితే వైరస్ను తటస్థీకరించే ప్లాస్మా కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని ఐజీఐబీ సీనియర్ శాస్త్రవేత్త శంతన్ సేన్ గుప్తా, అధ్యయనంలో పాల్గొన్న సహచరులు చెప్పారు.
ఆరు నెలల తర్వాత సేకరించిన నమూనాలలో 35 మందిలో యాంటీబాడీలు క్షీణిస్తున్న స్థాయిలను గుర్తించామని, తటస్థీకరించే యాంటీబాడీలు మూడు నెలలతో పోలిస్తే స్థిరంగా ఉన్నాయన్నారు.
‘సాధారణ జనాభా నుంచి వచ్చిన మొదటి నివేదిక ప్రకారం ధూమపానం చేసేవారు సెరోపోజిటివ్ అయ్యే అవకాశం తక్కువగా ఉందని గుర్తించాం.. కోవిడ్-19 శ్వాసకోశ వ్యాధి అయినప్పటికీ ధూమపానం రక్షణ కల్పించవచ్చని’ అభిప్రాయపడింది. ‘అలాగే ప్రజా రవాణాను వినియోగించేవారు, సెక్యూరిటీ, హౌస్-కీపింగ్ సిబ్బంది, ధూమపానం చేయనివారు, మాంసాహారులు వంటివారిలో అధిక సెరోపాజటివిటీ అధ్యయనంలో గుర్తించాం’అని శంతన్ సేన్ గుప్తా అన్నారు.
అటువంటి యాంటీబాడీల ఉనికి బట్టి కరోనా సంక్రమణ, కోలుకున్నారనడానికి సంకేతం.. అయితే, కరోనా సోకిన కొంత మందిలో యాంటీబాడీలు అభివృద్ధి చెందకపోవచ్చని ఐజీఐబీ డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ అన్నారు. అయితే, ఈ అధ్యయనం దేశవ్యాప్తంగా 17 నగరాల్లో చిన్న సమూహంపై నిర్వహించామని, తక్కువ నమూనాలతో చేసిన సర్వే ఫలితాలతో ఒక నిర్ణయానికి రాలేమని పేర్కొన్నారు.