నెమ్మదిగా అలవాటు చేసుకుంటారు.. పెట్రోల్ ధరలపై మంత్రి వ్యాఖ్యలు

0
21పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టేశాయి. ఇంధన ధరల పెరుగుదలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అటు సోషల్ మీడియాలోనూ నెటిజన్లు దీనిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత కొంత కాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనిపై స్పందించడంలేదు. ఇలాంటి తరుణంలో బీజేపీ నేత, బిహార్‌ మంత్రి.. పెట్రోల్ ధరల పెరుగుదలపై చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసేలా ఉన్నాయి.

పెరిగిన ధరలకు ప్రజలు నెమ్మదిగా అలవాటు పడతారు.. నారాయణ్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలివి. అంతటితో ఆగకుండా ఓ ఉచిత సలహా కూడా చేశారు. సామాన్యులు కార్లు వాడకపోవడమే ఉత్తమం అని చెప్పారు. ‘ప్రస్తుతం రాజకీయ నాయకులు తప్ప సామాన్యులు కార్లు వాడకపోవడం ఉత్తమం’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ఇంధన ధరలు పెరిగినా సామాన్యుల మీద పెద్దగా భారం పడదట అందుకు కారణం కూడా చెప్పారు.

‘సామాన్యులు ఎక్కువగా ప్రజా రవాణా వ్యవస్థ మీద ఆధారపడతారు. బస్సులు, రైళ్లలో ప్రయాణం చేస్తారు. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించే వారు చాలా తక్కువగా ఉంటారు. అందువల్ల ఇంధన ధరలు పెరిగినా సామాన్యుల మీద పెద్దగా భారం పడదు’ అని నారాయణ్ ప్రసాద్ అన్నారు.

మంత్రి నారాయణ ప్రసాద్ వ్యాఖ్యలు ప్రజాగ్రహాన్ని మరింత పెంచేలా ఉన్నాయి. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో సామాన్యుడు కుదేలవుతున్న వేళ.. రాజకీయ నాయకులు ప్రజలకు మద్దతుగా ఉండాల్సింది పోయి, ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. నారాయణ్ ప్రసాద్ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఎమ్మెల్యే ముఖేష్ రౌషన్ శుక్రవారం (ఫిబ్రవరి 19) బిహార్ అసెంబ్లీకి సైకిల్‌ మీద వచ్చి పెట్రో ధరల పెరుగుదలపై నిరసన వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here