నిర్మలా సీతారామన్‌పై నటుడు సిద్ధార్థ్ సెటైర్.. ఆ పదం వాడి తప్పుచేశాడంటున్న నెటిజన్లు

0
16పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా రోజురోజుకీ పెట్రో ధరలు పెరుగుతుండటం సామాన్య ప్రజలను కలవరపెడుతోంది. ప్రజలు ఇబ్బంది పడుతోన్నా పెట్రోల్ ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఇప్పటికే విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే, ప్రభుత్వం మాత్రం పెట్రోల్ ధరల విషయంలో తామేమీ చేయలేమని చేతులెత్తేస్తోంది. దీంతో పెట్రోల్ ధర రూ.100 చేరువైంది. దీనిపై మాట్లాడటానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా నిస్సహాయత వ్యక్తం చేశారు.

పెట్రోల్‌ భారం తనకు కూడా ధర్మసంకటంగానే ఉందని, అయినప్పటికీ తాను ఒక్కదాన్నే ఏం చేయలేనని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. శనివారం చెన్నై సిటిజన్స్‌ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పెట్రోల్‌ భారంపై తానిచ్చే సమాధానంతో ఏ ఒక్కరినీ సంతృప్తిపర్చలేనని అన్నారు. ధరల తగ్గింపు అనే సమాధానం మినహా ఏ ఒక్క దానిని ప్రజలు అంగీకరించరని వెల్లడించారు. పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి చేర్చడంపై జీఎస్టీ కౌన్సిల్‌ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రభుత్వరంగ చమురు సంస్థలే ఈ నిర్ణయం తీసుకుంటున్నాయని ఆమె గుర్తు చేశారు. పెట్రోల్ ధరల పెరుగుదల విషయంలో చమురు సంస్థలదే బాధ్యత అని అన్నారు.

అయితే, నిర్మలా సీతారామన్ అబద్ధాలు చెబుతారని.. ఆమెది మోసం చేసే వ్యక్తిత్వమని విమర్శిస్తూ సుప్రీం కోర్టు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఒక వీడియోను ట్వీట్ చేశారు. పెట్రోల్ ధరల పెరుగుదలకు సంబంధించి 2013లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన నిర్మలా సీతారామన్ వీడియోను.. శనివారం ఆమె మాట్లాడిన వీడియోను పక్కపక్కన పెట్టి పోస్ట్ చేశారు. పెట్రోల్ ధర పెరిగిపోవడంలో కేంద్ర ప్రభుత్వందే బాధ్యత అని 2013లో అన్న నిర్మలా సీతారామన్.. 2021లో చమురు సంస్థలదే బాధ్యత అని అంటున్నారని ఈ ట్వీట్ సారాంశం.

ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన నటుడు సిద్ధార్థ్.. ‘‘తాను నమ్మిన విషయాన్ని తనకు అనువుగా మలుచుకోవడంలో మామి తరవాతే ఎవరైనా. ఉల్లిపాయలు లేవు, జ్ఞాపకశక్తి లేదు, విలువలు లేవు. మామి రాక్స్’’ అని పేర్కొన్నారు. ఇక్కడ ఉల్లిపాయల ప్రస్తావన తీసుకురావడానికి కారణం.. గతంలో ఉల్లిపాయలు ధర పెరిగినప్పుడు తాను ఉల్లిపాయలు తినను అని ఒక కాంగ్రెస్ ఎంపీ ప్రశ్నకు నిర్మలా సీతారామన్ సమాధానం ఇవ్వడమే. ఇదిలా ఉంటే, ఒక కేంద్ర మంత్రిని మామి (ఆంటీ) అని సిద్ధార్థ్ సంబోధించడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

నిర్మలా సీతారామన్‌ను మామి అని సంబోధించి సిద్ధార్థ్ తన స్థాయిని తగ్గించుకున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. తప్పు ఎత్తిచూపడంలో తప్పులేదని.. కానీ అది గౌరవంగా, మర్యాదగా ఉండాలని సూచిస్తున్నారు. సిద్ధార్థ్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఆయనతో తాము ఏకీభవిస్తామని.. కానీ, ఈ విషయంలో మాత్రం ఆయన చేసింది తప్పని మరికొంత మంది అంటున్నారు. ఇక బీజేపీ సానుభూతిపరులు అయితే సిద్ధార్థ్‌ను తిట్టిపోస్తున్నారు. మొత్తం మీద పెట్రోల్ ధరలపై చేసిన ట్వీట్ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here