రామ్ చరణ్‌ను ఈ కార్యక్రమంలో హాజరు కావాలని కోరగానే.. తాను సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నానని, డైరెక్టర్‌తో మాట్లాడి చెప్తానని చెప్పి ఒక్కరోజులోనే ఆయన కన్ఫర్మ్ చేశారని సజ్జనార్ వెల్లడించారు. ‘‘అందరికీ తెలుసు.. ‘బాహుబలి’ డైరెక్టర్ రాజమౌళి గారి సినిమా RRRలో నటిస్తున్నారు. ప్రస్తుతం కీలకమైన షూటింగ్ జరుగుతోంది. అంత బిజీగా ఉన్నా మన కోసం ఆయన వచ్చారు. ఆయన్ని ఇక్కడికి పంపిన రాజమౌళి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను’’ అని సజ్జనార్ అన్నారు.
ఇక రామ్ చరణ్ మాట్లాడుతూ పోలీస్ ప్రాధాన్యమున్న సినిమా అయితే కథ వినకుండానే ఒప్పేసుకుంటానని అన్నారు. పోలీస్ పాత్రలో నటించడం అంటే తనకు ఇష్టమని వెల్లడించారు. త్వరలో రాబోయే ‘RRR’లోనూ పోలీసుగా కనిపించనున్నట్లు ఈ సందర్భంగా రామ్ చరణ్ గుర్తుచేశారు. ‘ధృవ’ సినిమాలో పోలీసుగా మెప్పించడానికి చాలా శ్రమించానని చెప్పారు. సాధారణంగా సినిమాల్లో హీరోలు పోలీసులుగా యాక్ట్ చేసినప్పుడు సరిగా చేయరని అపవాదు ఉందని.. అందుకే, ఎలాంటి తప్పు చేయకూడదనే ఉద్దేశంతో చాలా కష్టపడి ఆ పాత్ర చేశానని రామ్ చరణ్ తెలిపారు. కాగా, ఈ కార్యక్రమంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూరి రమేష్ కూడా అతిథిగా పాల్గొన్నారు.