తొలిరోజు 1.91 లక్షల మందికి వ్యాక్సిన్.. నో సైడ్ ఎఫెక్ట్స్

0
17ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్‌లో ప్రారంభమైంది. తొలి రోజు దేశవ్యాప్తంగా 1,91,181 మంది టీకా తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఎవరూ అనారోగ్యానికి గురికాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. తొలి రోజు కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని వెల్లడించింది. పలు దేశాల్లో వ్యాక్సిన్ల కారణంగా దుష్పరిణామాలు తలెత్తుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో భారతీయులకు ఇది గొప్ప ఊరట కలిగించే వార్త. అంతేకాదు, భారత్ శక్తిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిన సందర్భం.

శనివారం (జనవరి 16) ఉదయం ప్రధాని మోదీ విర్చువల్ ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం దేశవ్యాప్తంగా 3351 కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ కొనసాగింది. ఈ ప్రక్రియలో మొత్తం 16,755 మంది సిబ్బంది పాల్గొన్నారు. అయితే.. కొవిన్‌ యాప్‌లో కొన్ని టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో కొన్ని కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఆలస్యమైంది.

తొలి రోజు 12 రాష్ట్రాల్లో కొవాగ్జిన్‌, 11 రాష్ట్రాల్లో కొవిషీల్డ్‌ టీకా పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యూపీలో అత్యధికంగా అటు సైనిక ఆస్పత్రుల్లో పనిచేసే 3 వేల మందికి పైగా వైద్య సిబ్బంది తొలి డోసు వేయించుకున్నట్టు భారత సైన్యం తెలిపింది. దేశవ్యాప్తంగా జరిగిన వ్యాక్సినేషన్‌పై ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్‌ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో సమీక్షించారు.

‘కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభంతో దేశ ప్రజలకు ఉపశమనం లభించింది. కరోనా వైరస్‌పై పోరాటం చేసేందుకు ఈ వ్యాక్సిన్లు సంజీవనిలా దేశం ముందు నిలిచాయి’ అని మంత్రి హర్షవర్దన్ అన్నారు. కరోనా వైరస్‌ వ్యాక్సిన్ రూపొందించడంలో శాస్త్రవేత్తలు, పరిశోధకులు కీలక పాత్ర పోషించారని.. ఫార్మా సంస్థలు, ట్రయల్స్‌లో పాల్గొన్న వలంటీర్ల సహకారం కూడా మరవలేనిదని ఆయన పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here