టూల్‌కిట్ కేసు: దిశా రవిని ఉగ్రవాదులు కసబ్, బుర్హాన్ వనీతో పోల్చిన బీజేపీ ఎంపీ!

0
26గ్రెటా థన్‌బర్గ్ టూల్‌కిట్ వ్యవహారంలో అరెస్టయిన పర్యావరణ కార్యకర్త దిశా రవిపై బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమెను ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, బుర్హాన్ వనీలతో బీజేపీ ఎంపీ పీసీ మోహన్ పోల్చారు. ‘వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే.. చట్టానికి ఎవరూ అతీతులు కారని’ ఆయన ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. ‘ వయసు 21 ఏళ్లే. అజ్మల్ కసబ్ కూడా 21 ఏళ్ల వయసువాడే.. వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. నేరం అంటే నేరమే’ అని ఎంపీ మోహన్ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో గ్రెటా థన్‌బర్గ్‌ షేర్‌ చేసిన ‘టూల్‌కిట్‌’ను రూపొందించడంలో దిశతో పాటు నికితా జాకబ్‌, శంతనులే కీలక సూత్రధారులని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. కొత్త వ్యవసాయ చట్టాలపై రూపొందించిన టూల్‌కిట్‌ను వీరే గ్రెటా థన్‌బర్గ్‌తో పంచుకున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై దేశద్రోహం కేసు నమోదుచేసిన పోలీసులు.. దిశరవిని అరెస్ట్ చేశారు.

అయితే, వీరిని విడుదల చేయాలని ప్రతిపక్ష పార్టీలు, వ్యవసాయ సంఘాలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో విచారణలో వెల్లడయిన వాస్తవాలను ఢిల్లీ పోలీసులు బయటపెట్టారు. ఈ ‘టూల్‌కిట్‌’ను చేరవేసేందుకు దిశా ప్రత్యేకంగా ఓ వాట్సాప్‌ గ్రూపును క్రియేట్ చేసినట్లు ఢిల్లీ జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్ పోలీస్‌ (సైబర్‌) మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే, ఈ వాట్సాప్‌ గ్రూపును తర్వాత దిశ తొలగించినట్లు గుర్తించామన్నారు. అంతేకాదు, జనవరి 26కి ముందు రోజు పొయెటిక్‌ జస్టిస్‌ ఫౌండేషన్‌ (పీజేఎఫ్‌) జూమ్‌ మీటింగ్‌లో నికితా జాకబ్‌, శంతను పాల్గొన్నారని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు.

కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ, చిదంబరం, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆల్‌ ఇండియా ప్రొగ్రెసివ్‌ వుమన్స్‌ అసోసియేషన్‌ సెక్రటరీ కవితా కృష్ణన్‌, హక్కుల కార్యకర్త షబ్నమ్‌ హష్మీ, పర్యావరణ వేత్త లిసిప్రియా కాంగుజామ్‌ తదితరులు దిశా అరెస్టుపై ఆందోళన వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here