‘గాలి సంపత్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. నవ్వుల సందడికి తండ్రీకొడుకులు రెడీ

0
23బ్లాక్ బ‌స్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్పణ‌లో రూపొందుతోన్న చిత్రం ‘గాలి సంప‌త్’. అనిల్ ఈ చిత్రానికి స‌మ‌ర్పకుడిగా వ్యవ‌హ‌రించడంతో పాటు స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వ ప‌ర్యవేక్షణ కూడా చేస్తుండ‌డం విశేషం. వ‌రుస‌గా ఐదు బ్లాక్‌ బ‌స్టర్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి ప‌ర్యవేక్షణ‌లో మ‌రో బ్లాక్ బ‌స్టర్‌గా ‘గాలి సంప‌త్’ రూపొందుతోంది. అనిల్ కో-డైరెక్టర్, రైట‌ర్, మిత్రుడు ఎస్.క్రిష్ణ నిర్మాత‌గా ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

యంగ్ హీరో శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా న‌ట‌కిరీటి డా. రాజేంద్ర ‌ప్రసాద్ ‘గాలి సంప‌త్‌’గా టైటిల్ రోల్ పోషించిన ఈ మూవీకి అనీష్ ద‌ర్శక‌త్వం వ‌హించారు. ఈ మూవీ మ‌హా శివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న గ్రాండ్‌గా విడుద‌ల‌వుతుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

ఈ సందర్భంగా నిర్మాత ఎస్.క్రిష్ణ మాట్లాడుతూ.. ‘‘నా మిత్రుడు అనిల్‌ రావిపూడి ద‌ర్శక‌త్వ ప‌ర్యవేక్షణ‌లో రూపొందుతోన్న ‘గాలి సంప‌త్’ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్యక్రమాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి మార్చి 11న మ‌హాశివ‌రాత్రి కానుక‌గా ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్నాం’’ అని అన్నారు.

కాగా ఈ చిత్రంలో త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌త్య, ర‌ఘుబాబు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మిర్చి కిర‌ణ్‌, సురేంద్ర రెడ్డి, గ‌గ‌న్‌, మిమ్స్ మ‌ధు, అనీష్ కురువిల్లా, ర‌జిత‌, క‌రాటే క‌ళ్యాణి, సాయి శ్రీ‌నివాస్‌, రూపల‌క్ష్మి ముఖ్య పాత్రలు పోషించారు. అచ్చు రాజమణి సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫి అందించారు. తమ్మిరాజు ఎడిటర్. మిర్చి కిరణ్ మాటలు రాశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here