కర్ణాటక: బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లోకి ఎంపీ కొడుకు, హోస్‌కోటె ఎమ్మెల్యే!

0
23కర్ణాటకలో బీజేపీకి షాక్ ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమయ్యింది. చిక్కబళ్లాపుర ఎంపీ బచ్చేగౌడ కుమారుడు శరత్ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. గత నవంబరులో జరిగిన కర్ణాటక ఉప-ఎన్నికల్లో శరత్ హొసకోటె నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాను కాంగ్రెస్‌లో చేరుతున్న విషయాన్ని శరత్ స్వయంగా గురువారం మీడియాకు వెల్లడించారు. ఇదిలా ఉండగా, గత నాలుగైదు నెలలుగా కాంగ్రెస్‌లో చేరేందుకు శరత్ ఆ పార్టీ పెద్దలతో మంతనాలు సాగిస్తున్నారు.

కర్ణాటక పీసీపీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌తోను ఇటీవల ఆయన చర్చలు జరిపారు. ఈ నెలాఖరులోపు శరత్‌ కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖరారైంది. ఇటీవల శాసనసభ సమావేశాలలో శరత్‌పై హక్కుల ఉల్లంఘన చర్చకు అవకాశం కోరగా స్పీకర్ పట్టించుకోకపోవడంతో ప్రతిపక్ష కాంగ్రెస్‌ సభ్యులు మూకుమ్మడిగా పోడియంలోకి దూసుకెళ్లి ఆందోళన చేశారు. దీంతో శరత్‌కు మద్దతు వెనుక ఆయన కాంగ్రెస్‌లో చేరుతారనే చర్చ జరిగింది.

ఇదిలా ఉండగా 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో బీజేపీ తరఫున పోటీ చేసిన శరత్.. కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంటీబీ నాగరాజ చేతిలో పరాజయం చవిచూశారు. అయితే, కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన 17 మంది ఎమ్మెల్యేల్లో నాగరాజు కూడా ఒకరు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఎంబీటీ నాగరాజు తర్వాత జరిగిన పరిణామాలతో క్యాబినెట్ నుంచి వైదొలగి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతరం బీజేపీ గూటికి చేరారు. ఇక, 2020 నవంబరులో జరిగిన ఉప ఎన్నికల్లో హోస్‌కొటే నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీపడ్డారు.

అయితే, బీజేపీ టిక్కెట్ ఆశించి భంగపడ్డ శరత్ బచ్చేగౌడ్ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత ఎంటీబీ నాగరాజుకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన బీజేపీ మంత్రి పదవి కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో శరత్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు. అటు, బీజేపీ ఎంపీ బచ్చేగౌడ కూడా పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పాల్గొనడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here