కంప్యూటర్ ప్రోగ్రామర్లకు H-1B Visa.. వివాదానికి తెరదించిన అమెరికా

0
24హెచ్‌-1బీ వీసాకు సంబంధించి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన విధానాన్ని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కొంతకాలం నిలిపివేశారు. పాత విధానం లాటరీ పద్ధతినే ఈ ఏడాది డిసెంబరు 31 వరకు కొనసాగించనున్నట్టు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ () ప్రకటించింది. కొత్త ప్రక్రియకు అనుగుణంగా రిజిస్ట్రేషన్‌ వ్యవస్థలో మార్పులు చేయడం కోసం ఇమ్మిగ్రేషన్‌ ఏజెన్సీకి మరింత గడువు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

హెచ్‌-1బీ వీసాల జారీలో కంప్యూటరైజ్డ్‌ లాటరీ పద్ధతికి స్వస్తి పలుకుతూ డొనాల్డ్‌ ట్రంప్‌ మార్పులు చేసిన విషయం తెలిసిందే. గరిష్ఠ వేతన స్థాయి, నైపుణ్యం ఆధారంగా వీసాలు జారీచేసేలా ఆయన హాయాంలో కీలక సవరణ చేశారు. హెచ్‌-1బీ ఎంపికలో లాటరీ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు జనవరి 7న తుది ప్రకటన చేసిన యూఎస్‌సీఐఎస్… మార్చి 9 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది.

అయితే, కొత్త విధానానికి అనుగుణంగా హెచ్‌-1బీ నమోదు, ఎంపిక ప్రక్రియలో మార్పులు చేయాల్సి ఉన్నందున దీనిని డిసెంబరు 31 వరకు వాయిదా వేస్తున్నట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ ఓ ప్రకటనలో తెలిపింది. అప్పటివరకు పాత లాటరీ విధానాన్నే కొనసాగించనున్నట్లు వెల్లడించింది.

ఇక గతంలో కంప్యూటర్ ప్రోగ్రామర్‌లకు హెచ్ -1 బీ వీసాలకు అర్హత లేదని పేర్కొన్న యూఎస్‌సిఐఎస్.. ఫిబ్రవరి 3న మునుపటి మార్గదర్శకాలను రద్దు చేసింది. యుఎస్ అప్పీలేట్ కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో భారతీయ వ్యక్తిని కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా నియమించుకోవడానికి ఇన్నోవా సొల్యూషన్స్ ప్రయత్నించగా.. అతడికి హెచ్-1బీ వీసాను యూఎస్‌సీఐఎస్ నిరాకరించింది. ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేయడంతో అక్కడ అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో యూఎస్‌సీఐఎస్ తన నిబంధనలను సవరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here