ఐపీఎల్ వేలం: షారుఖ్ ఖాన్‌ను కొనేసిన ప్రీతీ జింటా.. ట్విట్టర్‌లో పేలుతున్న జోకులు!

0
28



ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం అంటే ప్రతి క్రికెట్ అభిమానికీ ఆసక్తికరమే. ఏ జట్టు ఏ ఆటగాడిని దక్కించుకుంది.. ఎంతకు కొనుగోలు చేసింది.. ఎక్కువ మొత్తం ఏ ఆటగాడికి పలికింది వంటి విషయాల కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. అయితే, చెన్నైలో గురువారం జరిగిన ఐపీఎల్ వేలంలో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఐపీఎల్ వేలంలో ఆటగాళ్ల కొనుగోలు కన్నా ఈ అంశం ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.

ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింటా సహ యజమానిగా వ్యవహరిస్తోన్న పంజాబ్ కింగ్స్ జట్టు.. తమిళనాడు కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ షారుఖ్ ఖాన్‌ను రూ. 5.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. బాలీవుడ్ బాద్‌షా, కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుఖ్ ఖాన్ పేరు పెట్టుకున్న ఈ క్రికెటర్ ప్రారంభ ధర రూ.20 లక్షలు కాగా పంజాబ్ కింగ్స్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ ఆటగాడి కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కూడా పోటీపడటం విశేషం.

షారుఖ్ ఖాన్‌ను పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసినట్టు ఐపీఎల్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌తో పాటు పంజాబ్ కింగ్స్ ట్విట్టర్ పేజ్‌లో పోస్ట్ చేశారు. పంజాబ్ కింగ్స్ అయితే సినీ నటుడు షారుఖ్ ఖాన్ జిఫ్ ఇమేజ్‌ను ట్వీట్ చేసి ‘షారుఖ్ ఖాన్ ఇప్పుడు పంజాబ్ కింగ్’ అని సరదాగా పేర్కొంది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానుల దృష్టి కూడా ఐపీఎల్ వేలంపై పడింది. షారుఖ్ ఖాన్, ప్రీతి జింటాలను ఉద్దేశించి ఫన్నీ ట్వీట్లు మొదలయ్యాయి. వేలంలో పంజాబ్ కింగ్స్ టేబుల్ పక్కనే కేకేఆర్ టేబుల్ కూడా ఉంది. వేలంలో షారుఖ్ ఖాన్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ పాల్గొన్నారు.

క్రికెటర్ షారుఖ్ ఖాన్‌ను పంజాబ్ కింగ్స్ దక్కించుకోగానే ఆర్యన్ ఖాన్ వైపు ప్రీతి జింటా చూస్తూ సరదాగా ఏదో అన్నారు. ఈ వీడియో కూడా ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. అలాగే, ఈ వేలం సందర్భంగా ‘వీర్-జార’ సినిమాను ఫ్యాన్స్ గుర్తుచేసుకున్నారు. షారుఖ్ ఖాన్, ప్రీతి జింటా జంటగా నటించిన ‘వీర్-జార’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. అందుకే, వీర్-జార మళ్లీ కలిశారని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక మీమ్స్, జోకులకు అయితే కరువే లేదు.

మరోవైపు, వేలం మధ్యలో దొరికిన బ్రేక్‌లో నటుడు షారుఖ్ ఖాన్‌తో ప్రీతి జింటా వీడియో కాల్ మాట్లాడారు. ఈ ఫొటోను పంజాబ్ కింగ్స్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోలో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ కూడా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here