ఏ దేశాధినేతకూ ఇవ్వని ఆఫర్ ఇచ్చిన ట్రంప్.. కిమ్ ఒప్పుకుంటే పరిస్థితి వేరేలా ఉండేది!

0
23అమెరికా మాజీ అధ్యక్షుడు , ఉత్తర కొరియా నియంత మధ్య జరిగిన మాటల యుద్ధం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. ఉత్తర కొరియాను భూస్థాపితం చేస్తామని ట్రంప్.. అమెరికాపై అణుదాడి చేస్తామని కిమ్ పరస్పర హెచ్చరికలు చేసుకున్నారు. ట్రంప్, కిమ్ చర్యలు ఎటు దారితీస్తాయోనని యావత్తు ప్రపంచ ఆందోళన చెందింది. రెండేళ్ల పాటు ఉప్పు నిప్పులా ఉన్న నేతలు చివరకు శాంతించడంతో వివాదం సద్దుమణిగింది.

మాటల యుద్ధానికి ముగింపు పలుకుతూ తొలిసారిగా ట్రంప్-కిమ్‌ల మధ్య 2018లో సింగ్‌పూర్ వేదికగా శాంతి చర్చలు జరిగాయి. ఇదిలా ఉండగా 2019లో హనోయి వేదికగా ఇరువురి మధ్య జరిగిన రెండో దఫా శిఖరాగ్ర చర్చల్లో జరిగిన ఆసక్తికర సంఘటన తాజాగా బయటకు వచ్చింది. ఆ సమయంలో తన ఎయిర్ ఫోర్స్ వన్‌లో ఇంటికి వెళ్లాలని కిమ్ జోంగ్ ఉన్‌కుకు డొనాల్డ్ ట్రంప్ ఆఫర్ ఇచ్చినట్టు బీబీసీ తన కొత్త డాక్యుమెంటరీలో ప్రస్తావించింది.

ఆ సమావేశంలో తొలుత ట్రంప్- కిమ్ మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగిందని, ఇద్దరూ దాడులు, ప్రతిదాడులపై హెచ్చరికలు చేసుకున్నారని ఈ డాక్యుమెంటరీ పేర్కొంది. ఆపై ఇద్దరూ తమ మొండి వైఖరిని వీడి స్నేహపూర్వక, ఇచ్చి పుచ్చుకునే ధోరణిలోకి వచ్చారని, ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకున్నారని తెలిపింది. ఈ సమావేశం చివరిలో ట్రంప్ ఏ దేశాధినేతకూ ఇవ్వని ఆఫర్‌ను కిమ్ ముందు ఉంచారని పేర్కొంది. అమెరికా దేశాధ్యక్షులకు మాత్రమే పరిమితమైన ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో వియత్నాం నుంచి ఉత్తర కొరియా వరకు లిఫ్ట్ ఇస్తానని, అందులో ఇంటికి చేరుకోవాలని సూచించారని బీబీసీ పేర్కొంది.

అయితే, ఈ ఆఫర్‌ను కిమ్ సున్నితంగా తిరస్కరించారని.. ఒకవేళ ఆయన అంగీకరించివుంటే, ఎన్నో రకాల సెక్యూరిటీ ఇబ్బందులు తలెత్తి వుండేవని అంచనా వేసింది. వీరిద్దరి మధ్య వచ్చిన ‘ఎయిర్ ఫోర్స్ వన్ లో లిఫ్ట్’ అంశాన్ని ట్రంప్ జాతీయ భద్రతా కౌన్సిల్ ఆసియా ప్రతినిధి మ్యాథ్యూ పాటింగర్ స్వయంగా వెల్లడించారని బీబీసీ వివరించింది. ఉత్తర కొరియా నుంచి చైనా మీదుగా కిమ్ హనొయ్‌కు రైల్లో రెండు రోజులు ప్రయాణించి వచ్చిన విషయం ట్రంప్ తెలుసుకుని ఈ ఆఫర్ చేశారని తెలిపింది. మీకు ఇష్టమైతే రెండు గంటల్లో ఇంటి వద్దకు చేర్చుతానని ట్రంప్ ఆఫర్ చేస్తే, కిమ్ సున్నితంగా తిరస్కరించారని తెలియజేసింది.

ఇక, 2018లో కిమ్, ట్రంప్ మధ్య సింగపూర్‌లో జరిగిన చర్చలకు చైనా విమానంలో కిమ్ అక్కడకు చేరుకున్నారు. ఆ సమయంలో తాను ప్రయాణించే ‘దీ బీస్ట్’ కారులోకి కిమ్‌ను ట్రంప్ ఎక్కించుకుని వెళ్లి, దానిలోని విశేషాలను స్వయంగా వివరించారు. ఇదిలా ఉండగా, అమెరికా విషయంలో తన వైఖరి ఎప్పటికీ మారబోదని, ఎప్పటికీ తమకు శత్రు దేశమేనని గత నెలలోనే కిమ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఈ వ్యాఖ్యలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here