ఈ వధూవరులకు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా.. అస్సలు షాకవ్వరు, ఇప్పుడిదే ట్రెండ్!

0
19కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు కొంత మంది గిఫ్ట్‌లు ఇచ్చి సర్‌ప్రైజ్ చేస్తారు. కొత్తదనం కోరుకునే మరికొంత మంది వినూత్న బహుమతులను ఇస్తారు. గిఫ్ట్‌లను ఎంపిక చేసుకునే విషయంలో చాలా కసరత్తు చేస్తారు. అయితే.. తమిళనాడులో కొత్తగా పెళ్లి చేసుకున్న జంటకు వరుడి స్నేహితులు ఇచ్చిన ఈ గిఫ్ట్‌లను మాత్రం ఎవరూ ఊహించలేరు. ఎందుకంటే వాళ్లు పెట్రోల్, గ్యాస్ సిలిండర్, ఉల్లిగడ్డలను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇప్పుడివి చాలా ఖరీదైన వస్తువులని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదుగా..!

గిఫ్టులు ఇచ్చే విషయంలో ట్రెండ్‌ మారింది. ప్రస్తుతం మనం వాడే వస్తువుల్లో ఏది ఎక్కువ ధర ఉంటే దాన్నే నూతన దంపతులకు ఇచ్చి సర్‌ప్రైజ్ చేస్తున్నారు. కానీ, గ్యాస్ బండ, ఉల్లిపాయలు, పెట్రోల్‌ను ఇవ్వాలనే వారి ఆలోచనకు మాత్రం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే.. ఇది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది మరి.

వధూవరులకు పెట్రోల్, గ్యాస్, ఉల్లిపాయలు బహుమతిగా అందజేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వస్తువులను గిఫ్ట్‌గా ఇచ్చి ఫొటోలకు ఫోజిచ్చారు. పైగా ఆ ఉల్లిపాయలను దండగా తీసుకొచ్చి దంపతుల మెడలో వేశారు. ఆ సమయంలో పెళ్లికుమార్తె తన నవ్వును బలవంతంగా ఆపుకోవడం వీడియోను మరింత ఆసక్తిగా మార్చింది.

చెన్నైకి చెందిన కార్తీక్‌, శరణ్య వివాహ వేడుకలో ఈ ఘటన చోటు చేసుకుంది. వంగరంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన పెళ్లిలో వరుడి మిత్రులు ఈ బహుమతులు ఇచ్చారు. ఐదు లీటర్ల పెట్రోల్‌, నిండు సిలిండర్‌తో పాటు ఉల్లిపాయలు ఇచ్చారు. పెట్రోల్ ధరలు ఇటీవలే 100 మార్కు అందుకున్న విషయం తెలిసిందే. కొంత కాలంగా వంట గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి తోడు ఉల్లిపాయలు ఇతర నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

వివాహ వేడుకకు వచ్చిన వారంతా ఈ వినూత్న గిఫ్ట్‌లను చూసి నవ్వు ఆపుకోలేకపోయారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు. ‘మీ ఆలోచన అద్భుతం..’ అని కొంత మంది కామెంట్ చేయగా.. ‘అవి చాలా ఖరీదైన కానుకలు.. భద్రంగా దాచుకోండి’ అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు.

‘పెట్రోల్‌, గ్యాస్‌ సిలిండర్‌తో జరభద్రం..’ అని మరో నెటిజన్ జాగ్రత్త చెప్పాడు. గ్యాస్ బండపై పెట్రోల్ క్యాన్ పెట్టడంతో.. అవి రెండూ అంటుకుంటే ప్రమాదమని అతడు హెచ్చరించాడు. అదీ నిజమే..! ఉత్సాహంతో గాల్లో తేలిపోతూ.. చిన్న పొరపాటు చేసినా, ఘోర విషాదం మిగులుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here