యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మద్యం విక్రయాలకు సంబంధించి కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. తాజా నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి తన ఇంట్లో కేవలం 6 లీటర్ల మద్యాన్ని మాత్రమే నిల్వ ఉంచుకోవచ్చు. అంతకంటే ఎక్కువ మోతాదులో మందు ఇంట్లో ఉంచుకోవాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సిందే. ఎక్సైజ్ శాఖ నుంచి లైసెన్స్ తీసుకోవాల్సింది.
ఈ లైసెన్స్ కోసం ఒక వ్యక్తి ఏడాదికి రూ.12,000 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు రూ.51 వేలను సెక్యూరిటీ డిపాజిట్ కింద పెట్టాల్సి ఉంటుంది. తద్వారా భారీగా ఆదాయం సమకూర్చుకోవడంపై యూపీ సర్కార్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. లిక్కర్ విక్రయాల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో యూపీ ప్రభుత్వానికి రూ.28,340 కోట్ల ఆదాయం సమకూరింది. నూతన ఎక్సైజ్ విధానాలతో 2021-22లో రూ.34,500 కోట్లు రాబట్టాలని యోగి సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది.
పరిమితికి మించి మద్యం కొనుగోళ్లకే కాకుండా రవాణా చేసేందుకు కూడా లైసెన్స్ కలిగి ఉండాల్సిందేనని యూపీ ఎక్సైజ్ విభాగం అదనపు ప్రధాన కార్యదర్శి సంజయ్ ఆర్ భూస్ రెడ్డి స్పష్టం చేశారు. నిర్దేశించిన పరిమితి కంటే మద్యం సేవించేందుకు కూడా ఈ లైసెన్స్ తప్పనిసరి చేసినట్లు తెలిపారు.