ఆక్స్ఫర్డ్కు చెందిన లాంగ్వేజెస్ విభాగం 2020లో అత్యంత ప్రాచుర్యం పొందిన హిందీ పదంగా ‘ఆత్మనిర్భరత’ను ఎంపిక చేసింది. కరోనా ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించే సమయంలో దేశం (స్వావలంబన) సాధించాల్సిన అవసరాన్ని నరేంద్ర మోదీ నొక్కి చెప్పారని, నాటి నుంచి ఆ పదం వాడుక అనూహ్యంగా పెరిగిందని ఆక్స్ఫర్డ్ సంస్థ పేర్కొంది.
‘మహమ్మారి సమయంలో ఎదురైన సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని ఎంతో మంది భారతీయులు దైనందిన జీవితంలో సాధించిన విజయాలను ‘ఆత్మనిర్భరత’ పదం ప్రతిబింబిస్తుంది. అందుకే ఎన్నో పదాల వడపోత తర్వాత దాన్ని ఎంపిక చేశాం’ అని ఆక్స్ఫర్డ్ లాంగ్వేజెస్ సంస్థ పేర్కొంది.
ఇది కేవలం పదం మాత్రమే కాక గడిచిన సంవత్సరంలో దేశ నైతికత, మానసిక స్థైర్యం, ముందుచూపును ప్రతిబింబించిందని సభ్యులు అన్నారు. అయితే.. ఆక్స్ఫర్డ్ హిందీ పదంగా ఎంపికైనప్పటికీ దాన్ని ఆ సంస్థ డిక్షనరీల్లో కచ్చితంగా స్థానం కల్పిస్తారని చెప్పలేం.