ఆక్స్‌ఫర్డ్ టీకాకు బ్రిటన్ గ్రీన్ సిగ్నల్.. వచ్చే ఏడాది నుంచే వ్యాక్సినేషన్

0
31ఆక్స్ ఫర్డ్- ఆస్ట్రాజెనికా సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకా అత్యవసర వినియోగానికి బ్రిటన్ రెగ్యులేటరీ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో ఎప్పుడెప్పుడా అని ప్రపంచం ఎదురుచూస్తున్న అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఫైజర్-బయోఎన్‌టెక్ టీకాకు బ్రిటన్ ఆమోదం తెలపడంతో పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. తాజాగా, ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌‌కు ఆమోదం తెలపడంతో వచ్చే వారం వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు 6 లక్షల మంది ఫైజర్ టీకాను తీసుకున్నట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

వ్యాక్సిన్ తొలి డోసులు బుధవారం విడుదల చేయనున్నామని, వచ్చే ఏడాది ఆరంభంలో వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని ఆస్ట్రాజెన్‌కా ఓ ప్రకటనలో తెలిపింది. మొత్తం 100 మిలియన్ డోస్‌ల టీకాల సరఫరాకు యూకే ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నామని, తొలి త్రైమాసికంలో మిలియన్ల డోస్‌లను అందజేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొంది.

ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఆమోదం వల్ల దేశంలో కఠినమైన లాక్‌డౌన్‌ను ఎత్తివేయడానికి వీలు కలుగుతుందని యూకే మంత్రి మైఖేల్ గోవ్ సోమవారం వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్ వల్ల మిలియన్ల మంది క్రిస్మస్ పండుగను జరుపుకోలేకపోయారన్నారు. మరోవైపు, కొత్తరకం కరోనా వైరస్ లండన్‌లో శరవేగంగా వ్యాప్తిచెందుతోంది. కొత్తరకం స్ట్రెయిన్ 70 శాతం వేగంగా విస్తరిస్తోంది. కరోనా బాధితులతో ఆస్పత్రుల్లో పడకలన్నీ నిండిపోయాయి. ప్రయాణాలపై కూడా నిషేధం కొనసాగుతోంది.

ఆక్స్‌ఫర్డ్ టీకా అత్యవసర వినియోగానికి యూకే ఆమోదం తెలపడంతో పెద్ద ఎత్తున పంపిణీ ప్రారంభం కానుంది. మిగతా టీకాలతో పోల్చితే ఇది తక్కువ ధరకు లభించడమే కాదు, సాధారణ రిఫ్రిజిరేటర్‌లో భద్రపరచవచ్చు. ‘యూకేలోని మిలియన్ల ప్రజలకు ఈ రోజు ఎంతో ముఖ్యమైంది.. ఈ టీకాను ఎవరైతే తీసుకుంటారో సమర్ధవంతంగా పనిచేస్తుంది.. కోవిడ్‌ను నిరోధించగలదని నిరూపించిన ఈ టీకాను ఎటువంటి లాభాపేక్ష లేకండా ఆస్ట్రాజెనెకా సరఫరా చేస్తుంది’ అని ఆ సంస్థ సీఈఓ పాస్కల్ సోరియట్ అన్నారు.

ఆస్ట్రాజెన్‌కా వ్యాక్సిన్.. వైరల్ వెక్టర్ టీకా.. చింపాంజీలలో ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే సాధారణ కోల్డ్ వైరస్ బలహీనమైన వెర్షన్ ఆధారంగా రూపొందించారు. సార్స్-కోవి-2గా పిలిచే కరోనా వైరస్‌పై దాడి చేసే రోగనిరోధక శక్తి సామర్ధ్యంతో దీనిని తయారుచేశారు.

ఆక్స్‌ఫర్డ్ టీకా ఇతర వ్యాక్సిన్ల కంటే వేగంగా, మరింత సమర్థవంతంగా రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది అని లాన్‌సెట్ మెడికల్ జర్నల్ ఎడిటర్ ఇన్ చీఫ్ డాక్టర్ రిచర్డ్ హోర్టన్ అన్నారు. ప్రపంచ స్థాయిలో వ్యాక్సిన్ ఇమ్యునైజేషన్ గురించి ఆలోచించడం చాలా ముఖ్యం ఎందుకంటే ఒక దేశంలో రోగనిరోధకశక్తిని కలిగించి, మరో దేశంలో పనిచేయకపోతే ముప్పు ఉంటుందని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here