‘అరణ్య’ విడుదతేదీ ఖరారు.. వేసవిలో వస్తోన్న రానా

0
29‘బాహుబలి’ తరవాత పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. ఈ సినిమాలో భళ్లాలదేవుడిగా ఆయన నటన జాతీయ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించింది. దీనికి తోడు ఆయన హిందీ సినిమాల్లోనూ నటిస్తుండటంతో బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు ఉంది. అందుకే, ఆయనతో బహుభాషా చిత్రాలు చేయడానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో రానా చేసిన బహుభాషా చిత్రం ‘హాథీ మేరే సాథీ’. ఇది తెలుగులో ‘అరణ్య’ అనే టైటిల్‌తో వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్లోకి వెళ్లిపోయింది.

ప్రభు సాల్మన్ డైరెక్ట్ చేసిన ఈ భారీ బ‌డ్జెట్ మూవీని తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో ప్రపంచ‌వ్యాప్తంగా మార్చి 26న‌ విడుద‌ల చేస్తున్నట్లు నిర్మాత‌లు ప్రక‌టించారు. నిజానికి ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సింది. లాక్‌డౌన్ కారణంగా ఆలస్యమైంది. ఓటీటీలో విడుదల చేసేస్తారనే రూమర్లు అప్పట్లో వచ్చాయి. కానీ, నిర్మాతలు వాటిని ఖండించారు. థియేటర్లలో విడుదల చేయడానికి వేచి చూశారు. మొత్తానికి ఒక విడుదల తేదీని నిర్ణయించారు.

‘‘నూత‌న సంవ‌త్సరాన్ని, సాధారణ పరిస్థితులను స్వాగ‌తిస్తూ మార్చి 26న మీ ద‌గ్గర‌లోని థియేట‌ర్‌లో ‘హాథీ మేరే సాథీ/ అర‌ణ్య/ కాండ‌న్’ను తీసుకువ‌స్తున్నందుకు మేం ఎంత‌గానో సంతోషిస్తున్నాం!’’ అని రానా ట్వీట్ చేశారు.

25 సంవ‌త్సరాలుగా ఒక అర‌ణ్యంలో జీవిస్తూ వ‌స్తున్న ఒక మ‌నిషి క‌థ ‘అరణ్య’. ఈ చిత్రం ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌స్యలు, అట‌వీ నిర్మూల‌న సంక్షోభం గురించి చ‌ర్చిస్తుంది. ఈ మూవీలో తమిళ హీరో విష్ణు విశాల్‌, జోయా హుస్సేన్‌, శ్రియ పిల్గావోంక‌ర్ కీల‌క పాత్రలు పోషించారు. శంత‌ను మొయిత్రా సంగీతం స‌మ‌కూర్చిన ఈ చిత్రానికి ఎ.ఆర్‌. అశోక్ కుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించింది. తెలుగులో వనమాలి మాటలు, పాటలు రాశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here