క్యాబినెట్ భేటీలో రాజ్యాంగంలోని 25వ సవరణపై సభ్యులు దృష్టి సారించారు.. అధ్యక్షుడు తన కార్యాలయం అధికారాలను, విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నట్టు నిర్ధారణకు వస్తే వైస్ ప్రెసిడెంట్, క్యాబినెట్‌తో ఆయనను పదవి నుంచి తొలగించడానికి ఈ అధికరణం వీలు కల్పిస్తుంది. ఈ ప్రక్రియను ప్రారంభించడానికి ఉపాధ్యాక్షుడు మైక్ పెన్స్ క్యాబినెట్‌కు నాయకత్వం వహించాల్సి ఉంటుంది. క్యాబినెట్లో 25వ సవరణపై చర్చ జరిగిందని, ట్రంప్ పట్టు కోల్పోయారని రిపబ్లికన్ పార్టీ నేతలు వ్యాఖ్యానించినట్టు సీఎన్ఎన్ తెలిపింది. సీబీఎస్, ఏబీసీ మీడియాలు సైతం ఇదే విధంగా స్పందించాయి.
అధ్యక్ష ఎన్నికల్లో మోసాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ట్రంప్ తన మద్దతుదారులను రెచ్చగొట్టారు.. ఇతర అనుచిత ప్రవర్తన అతని నాయకత్వ సామర్థ్యం గురించి ప్రశ్నలను లేవనెత్తింది. కొత్త అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టడానికి మరో 15 రోజులే ఉండగా.. కాంగ్రెస్‌పై దాడితో 25వ సవరణను ఉపయోగించి ట్రంప్‌ను అధ్యక్ష పీఠం నుంచి తొలగించాలని డెమొక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు.
ట్రంప్‌ను తొలగించాలని కోరుతూ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌కు డెమొక్రాట్స్ జ్యుడీషియరీ కమిటీ ఓ లేఖ రాసింది. ఆయన తిరుగుబాటు చర్యకు ప్రేరేపించారని, ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే ప్రయత్నం చేశారని అన్నారు. ట్రంప్ బుధవారం నాటి ప్రసంగాన్ని ఎత్తిచూపిన డెమొక్రాట్లు.. తాను మానసికంగా సిద్ధంగాలేనని, ఎన్నికల ఫలితాలను అంగీకరించలేకపోతున్నానని’ వెల్లడించారు.
‘క్యాపిటల్ భవనంపై దేశీయ ఉగ్రవాద దాడులకు అధ్యక్షుడు ప్రేరేపించారు.. ప్రజాస్వామ్యానికి ఆయన ముప్పుగా పరిణమించారు.. తక్షణమే ఆయనన్ను అధ్యక్ష పీఠం నుంచి తొలగించాలి’ డెమొక్రాట్ రిప్రంజంటేటివ్ కథ్లీన్ రైస్ అన్నారు. 25వ సవరణను వినియోగించి ఆయనను కచ్చితంగా అధికారం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.