అనసూయకు పవన్ కళ్యాణ్ మరో ఛాన్స్!

0
21పవర్ స్టార్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో బిజీగా ఉన్నారు. ‘వకీల్ సాబ్’ షూటింగ్‌ను ఇటీవల పూర్తిచేసిన పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఇంకా టైటిల్ ఖరారు చేయని సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే బోలెడన్ని ఆసక్తికర రూమర్లు వచ్చాయి. అయితే, తాజాగా మరో ఆసక్తికర రూమర్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ఈ సినిమాలో భాగం కానున్నారట. ఈ సినిమాలో అనసూయ ఒక ప్రత్యేక గీతంలో నర్తించనున్నారని టాక్. అలాగే, ఒక చిన్న పాత్ర కూడా పోషిస్తున్నారట. నిజానికి పవన్ కళ్యాణ్‌తో స్పెషల్ సాంగ్‌లో డ్యాన్స్ చేయడానికి అనసూయకు ఇంతకు ముందే అవకాశం వచ్చిందట. ‘అత్తారింటికి దారేది’ సినిమాలోని ‘ఇట్స్ టైమ్ టు పార్టీ’ పాటలో అనసూయను తీసుకోవాలని దర్శకుడు త్రివిక్రమ్ భావించారట. కానీ, వ్యక్తిగత కారణాల వల్ల అనసూయ ఈ అవకాశాన్ని వదులుకున్నారని టాక్.

అయినప్పటికీ ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో ప్రత్యేక గీతంలో నర్తించే అవకాశాన్ని అందుకున్నారని అంటున్నారు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ సినిమా నుంచి రెండో సారి పిలుపు రావడం అనసూయ అదృష్టం అని కొంత మంది అభిప్రాయపడుతున్నారు. ఈసారి చేయడానికి అనసూయ కూడా అంగీకరించారట. నిజానికి, ఈ ఏడాది వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని అనసూయ భావిస్తున్నారట. ఈ ఏడాదే ఆమె తమిళ్, మలయాళ ప్రేక్షకులకు కూడా పరిచయం కాబోతున్నారు.

ఇదిలా ఉంటే, క్రిష్-పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న మూవీ పీరియడ్ డ్రామా. కాబట్టి ఇందులో ప్రత్యేక గీతం అంటే చాలా రిచ్‌గా ఉంటుంది. అలాంటి పాటలో అనసూయ నర్తిస్తే అదిరిపోవడం ఖాయం. దీనికి తోడు స్పెషల్ సాంగ్స్ చేయడం అనసూయకు కొత్తేమీ కాదు. కాబట్టి, ఈ పాటను సినిమాకు మరో ఆకర్షణ కూడా అవుతుంది. ప్రస్తుతానికి అయితే ఇది రూమర్. అధికారిక ప్రకటన వస్తే కానీ ఇందులో నిజమెంతో తెలీదు. ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. యం.యం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here