మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన సైన్యం.. ఉగ్రవాదులు బయటకు వెళ్లకుండా అన్ని మార్గాలనూ మూసివేసింది. ఈ సమయంలో తీవ్రవాదులు కాల్పులు జరపడంతో అప్రమత్తమైన సైన్యం.. ఎదురు కాల్పులు ప్రారంభించింది. ఆ ప్రాంతంలో ఎటువంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా అదనపు బలగాలను రప్పించారు. ముందు జాగ్రత్తగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్టు తెలుస్తోంది.
ఇండియన్ ఆర్మీ రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఆ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతోందని, మరింత మంది ఉగ్రవాదులున్నట్టు భావిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. షాల్గుల్ అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయని తెలిపారు. ఎన్కౌంటర్లో హతమైన ఉగ్రవాదులను గుర్తించే ప్రక్రియ సాగుతోందని అన్నారు.
ఇక, ఫిబ్రవరి 19న శ్రీనగర్‌లోని బార్గుల్లా బాగ్ వద్ద దుస్తుల్లో తుపాకులు దాచుకుని వచ్చి పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి ఇద్దర్ని పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. అదే రోజున బుద్గామ్ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో ఓ సైనికాధికారి అమరుడయ్యారు.