అంతర్జాతీయంగా వ్యతిరేకత.. గోప్యతా విధానంలో మార్పులపై వెనక్కుతగ్గిన వాట్సాప్

0
26గోప్యతా పాలసీలో మార్పులపై తీవ్ర విమర్శలు రావడంతో వాట్సాప్ వెనక్కు తగ్గింది. అంతర్జాతీయంగా వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఫిబ్రవరి 8 నుంచి అమలు చేయాలనుకున్న గోప్యతా విధానాన్ని మే 15కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ‘ఫిబ్రవరి 8న ఏ ఒక్క అకౌంట్‌ను నిలివేయం.. రద్దు చేయం.. గోప్యత, భద్రతకు సంబంధించిన సమాచారం విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై సందేహాలను నివృత్తి చేస్తాం.. మే 15న కొత్త విధానం అమల్లోకి వచ్చేలోపు ప్రజలకు మా విధానంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాం’అని శుక్రవారం అర్ధరాత్రి తన అధికారిక బ్లాగ్‌లో వాట్సాప్ తెలిపింది.

జనవరి 4 నుంచి కొత్త షరతులు, నిబంధనలు ఆమోదించాలంటూ వాట్సాప్‌ 200 కోట్ల మంది వినియోగదారులకు నోటిఫికేషన్లు పంపుతోంది. ఫేస్‌బుక్‌తో పంచుకునే సమాచారం విషయంలో చేసిన మార్పులను అంగీకరించకుంటే ఫిబ్రవరి 8 తర్వాత వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయని వినియోగదారులను హెచ్చరించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. తమ వ్యక్తిగత గోప్యతకు విఘాతం కలుగుతుందనే భయం వినియోగదారులను వెంటాడింది.

వాట్సాప్‌కి ప్రత్యామ్నాయంగా సిగ్నల్‌, టెలిగ్రామ్‌పై చాలా మంది వినియోగదారులు దృష్టిసారించారు. గత కొద్ది రోజుల్లో 2.5 కోట్ల మంది కొత్త వినియోగదారులు టెలిగ్రామ్‌‌వైపు మొగ్గుచూపారు. అలాగే, సిగ్నల్‌ యాప్‌ను కూడా భారీగా డౌన్‌లౌడ్‌ చేశారు. ఈ నేపథ్యంలో కొత్త గోప్యతా విధానంపై వాట్సాప్‌ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కొత్త మార్పులు వాట్సాప్‌లోని బిజినెస్‌ ఫీచర్స్‌ ఉపయోగించే వారికి మెరుగ్గా సేవలందించడానికి మాత్రమే రూపొందించామని, వ్యక్తిగత సంభాషణలకు వర్తించదని స్పష్టం చేసింది.

వాట్సాప్ కొత్త నిబంధనలను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో పిల్ దాఖలయ్యింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సుప్రీంలో పిటిషన్ వేశారు. ప్రతీ వినియోగదారుడి వివరాలు లేదా డేటా గోప్యత, భద్రతకు సంబంధించి కార్యనిర్వాహక, చట్టబద్ధమైన ఇతర బాధ్యతలను నిర్వర్తించేలా కేంద్ర ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని కోరారు.

వాట్సాప్ నుంచి పరిమిత సమాచారం ఇప్పటికే ఫేస్‌బుక్‌లో భాగస్వామ్యం చేశారు. కానీ వాట్సాప్ నిబంధనలలో మార్పులు 2016లో చోటుచేసుకున్నాయి. అప్పటి నుంచి వాటిని మార్చలేదు. వాట్సాప్ తన విధానాలను అప్‌డేట్ చేయడంతో నిపుణులు లేవనెత్తిన అంశాలతో యూరప్, ఇండియా కోసం ప్రత్యేక గోప్యత, డేటా షేరింగ్ విధానాలను రూపొందించింది. ఈ కారణంగా, భారతదేశంలో వ్యక్తిగత డేటా రక్షణ చట్టాన్ని సత్వరమే అమలు చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. భారత్ డేటా రక్షణ బిల్లు- 2018ను కమిటీ నివేదిక ఆధారంగా రూపొందించారు. ఇంకా చట్టంగా మారని ఈ బిల్లు ప్రస్తుతం పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here